Kanche Movie Telugu Review
– Varun Tej, Pragya Jaiswal, Nikitin Dheer, Srinivas Avasarala, Sowcar Janaki, Gollapudi Maruti Rao. Directed by Krish. Release Date – 22 October 2015.
‘కంచె’ సినిమా సమీక్ష
‘కంచె’ సినిమా చాలా రోజుల తరువాత ఒక మంచి సినిమా చూసిన అనుభూతిని కలిగించింది. రెండో ప్రపంచ యుద్ధ నేపధ్యంలో జరిగిన ధూపాటి హరిబాబు (వరుణ్ తేజ్) మరియు రాచకొండ సీతాదేవి (ప్రగ్య జైస్వాల్) ప్రేమకథ అలరించింది.
మనిషికి మనిషికి మధ్య ఉన్న కులం, మతం, జాతి, ప్రాంతం అనే అడ్డుగోడలు తొలగించుకుని సాటి మనిషికి సహాయపడాలి అని గుర్తు చేసి గుండెలోతుల్లో ఉన్న మానవత్వపు తడిని స్పృశించిన దర్శకుడు క్రిష్ జాగర్లమూడి అభినందనీయుడు.
ఇది నిజాయితీగా కథకు కట్టుబడి మంచి కథనంతో కథను నడిపించిన సినిమా. ఆలోచింపచేసే మాటలు వ్రాసిన బుర్రా సాయి మాధవ్, సన్నివేశానికి తగిన పాటలు వ్రాసిన సీతారామశాస్త్రి గారు, అధ్బుతమైన నేపధ్య సంగీతం ఇచ్చిన చిరంతన్ భట్ – వీరిని ప్రత్యేకంగా అభినందించాలి.
హీరో కావటానికి తన కుటుంబం అండదండలు ఉండి కూడా కంచె లాంటి సినిమాని ఎంచుకున్నందుకు వరుణ్ తెజ్ అభినందనీయుడు. తన నటనా చాతుర్యంతో మైమరిపించకపోయినా తన పాత్రకు తగ్గట్టుగా బాగా నటించాడు. సంభాషణలు పలకటం మీద మరింత శ్రద్ధ పెడితే బాగుండేది.
హీరోయిన్ ప్రగ్య జైస్వాల్ రాచకొండ సీతాదేవి పాత్రలో చూడటానికి చాలా బాగుంది, పాటల్లో మరింత అందంగా ఉంది. కాని కీలక సన్నివేశాల్లో నటనలో పరిణితి చూపించలేకపోయింది. తనకి మొదటి సినిమా కాబట్టి బాగానే చేసిందనే చెప్పాలి.
ఈ చిత్రానికి కీలకమైన యుద్ధ సన్నివేశాలు మరీ ఉత్కంఠ రేపకపోయినా తెలుగు సినిమా స్థాయికి చాలా బాగా తెరకెక్కించారు.
మూస సినిమాల మధ్యలో ఇది ఒక మంచి సినిమా. గమ్యం, వేదం లాంటి మంచి చిత్ర దర్శకుడు క్రిష్ పైన నమ్మకంతో ఈ సినిమాకి వెళ్ళిన వాళ్ళని ఈ చిత్రం నిరాశపరచదు. కాని సినీచరిత్రలో కనీ వినీ ఎరుగని గొప్ప చిత్రం చూడాలనే ఉద్దేశ్యంతో వెళితే నిరాశపడతారు.
చిన్న చిన్న లోపాలుఉన్నప్పటికీ ఇటువంటి మంచి సినిమాలు అందిస్తున్నందుకు క్రిష్ కి తెలుగు చిత్ర సీమ రుణపడి వుంటుంది. వాణిజ్య విలువల పేరుతో ఎక్కడా దారి తప్పకుండా రూపొందించిన ఈ చిత్రాన్ని ఆదరించటం ద్వారా తమ అభిరుచి స్థాయిని నిర్ణయించుకోవాల్సింది ప్రేక్షకులే.
– Surendra.S for TeluguCafe.com
There are no comments